Saturday 12 May 2012

అమ్మ కోసం తపన

!!!మాతృమూర్తులందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు!!! 


అమ్మ ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు .ఎందుకంటే ప్రతివక్కరు శిశు దశ నుంచి ఆ ప్రేమను పొంది  ఒక మనిషి గా  పరిపక్వత చెందుతారు ఈ పరిణామంలో ప్రతిక్షణం ప్రతిఫలించే తల్లిప్రేమ నిర్వచించలేనిది.


మాతృదినోత్సవ సందర్భంగా మరియు వనజవనమాలి గారి అత్తమ్మలో అమ్మను చూస్తున్న వారి మహోన్నతమైన మనస్సుకు స్పందించి ,నాకు దగ్గరిబందువులలో ఒక అమ్మ దీనమైన జీవితకథ గురించి ఈ పోస్ట్ రాయాలనిపించింది.

ఆ అమ్మ జీవితచరమాంకంలో అనుభవిస్తున్న శేష జీవితాన్ని చూస్తే హృదయం ద్రవించక మానదు.
ఒక విషయమేమిటంటే ఆమె ఆరోగ్యంగా వున్నపుడు సంతానమే కాకుండా బంధువర్గం అంతా ఎంతో ప్రేమగా వుండేవారు.కాని నిజమైన అవసరమైన అవసానదశలో అందరూ దూరమయ్యారు సేవ చెయ్యవలసిన పరిస్తితి వస్తుందనే భయంతో .

కూతుర్లమీద ప్రేమతో ఎప్పుడు తపించే ఆమె ,వాళ్ళు నన్ను చూడటంలేదే అని కాకుండా నేను వాళ్ళని చూడలేకపోతున్నాను అని ఎప్పుడూ బాధపడుతూ వుంటుంది.వాళ్ళ వాదన ఏమంటే మా సంసారాలు మాపిల్లలని మేము చూసుకోవాలి కదా అని.కాని వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి పడే తపనలాంటిదే కదా ఆమెది కూడా అని ఎంతో కన్వినిఎంట్ గా విస్మరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది .
కూతుర్లుకూడా మాతృమూర్తులే కదా మరి ??

ఆమె కోడలు కూడా ఆమె చాదస్తాన్నే విసుక్కుంటుంది కాని తన తల్లిలాగా ఎప్పటికీ గౌరవించలేకపోతున్నది. మరీ ఆమె కూడా మాతృమూర్తే కదా ????

వృద్ధులు అవసానదశలో శిశువులలాగ ప్రవర్తిస్తారు అని ఎక్కడో చదివాను. దానినే చాదస్తంగా భావించి విసుక్కుంటూ వుంటారు . కాని అందరూ వాళ్ళ చివరిదశలో ఎంతోకొంత చాదస్తంగా ప్రవర్తించబోతారని ఎందుకు ఆలోచించరు .మనుమలు మనుమరాళ్ళు విసుక్కుంటుంటే ఎందుకు వారించరు ???

ఆమె కొడుకు ఒక్కడే బాగా చూడటం కన్నా కుతుర్లూ, కోడలు, మనుమలు మనుమరాళ్ళు అందరూ ప్రేమగా మాట్లాడాలని ఆమె తపన , ఎవరూ చీదరించుకోకుండా విసుక్కోకుండా ఆమె జీవితం ముగియాలని ఆమె కొడుకు పడే తపన .